మరో కలకలం..

జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా ఢిల్లీ నిజాముద్దీన్‌ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన ముగ్గురిలో వెల్దండకు చెందిన వ్యక్తితో పాటు భార్య, కుమారుడిని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, జనగామకు చెందిన ఇద్దరు వ్యక్తులను వరంగల్‌ ఎంజీఎంకు తరలించిన విషయం విధితమే. అయితే బుధవారం మరో వ్యక్తి కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు సమాచారం అందడంతో అధికారులు అలర్టయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు జనగామ అంబేడ్కర్‌ నగర్‌లోని ఆయన తండ్రిని విచారించారు. అజ్మీర్‌ దర్గాకు వెళ్లి వచ్చినట్లు చెబుతున్న సదరు వ్యక్తి ఢిల్లీలో ఓ రోజు ఉన్నట్లు తెలియడంతో కొడుకును సిద్దిపేట నుంచి, తండ్రి, తల్లి, సోదరిని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అశోక్‌ కుమార్, సీఐ మల్లేస్, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జనగామ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే వెల్దండలో కరోనా కలకలం రావడంతో ఆ గ్రామానికి కొత్త వారెవరూ రాకుండా.. ఆ ఊరి వ్యక్తులు బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు చేపట్టింది.  ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని జనగామకు ఇంకా ఎవరైనా వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.