న్యూఢిల్లీ: మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మహమ్మారిని అంతం చేసే పరిశోధనలకు నిధులు కేటాయిస్తూనే.. అంటువ్యాధి ప్రబలకుండా లాక్‌డౌన్ విధిస్తున్నాయి. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లే వెసలుబాటును కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగానే లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తూ పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ఇలాంటి వారి కారణంగా అత్యవసర సేవల నిమిత్తం రోడ్ల మీదకు వచ్చిన ప్రజలపై కూడా పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. అందరినీ ఒకే గాటన కట్టి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘాలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కో దేశంలో పౌరుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్నాయి.
భారత్‌లో మార్చి 24 నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఇక ఆనాటి నుంచి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. కరోనా వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా లాఠీలకు పనిచెబుతున్నారు. మరికొన్ని చోట్ల గుంజీలు తీయిస్తూ.. వీధుల వెంట పరిగెత్తిస్తూ.. కొడుతున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో ఓ పోలీసు మరో అడుగు ముందుకేసి పౌరుడి నుదటిపై.. ‘‘నేను లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాను. నాకు దూరంగా ఉండండి’’అంటూ రాతలు రాయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అతడిపై వేటు వేసినట్లు ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.(లాక్‌డౌన్: ఇది అమానవీయ చర్య: ప్రియాంక)